29, జనవరి 2009, గురువారం

శిలా శిశువు

ఆ సముద్ర తీరంలో పడివుందొక

ఇసుక పలుకు

పాపం!

తెలియదులే తన ఘనత తనకు

కడలిలో లో లోతుల

ఖనిజ శిలా సమూహాల

వుద్భవించి

అంతర్జల ప్రవాహాల రాపిడిలో

మాత్రు శిలను వీడిపోయి

విడివడి కడలి అలల కదలికల

ఓలలాదితేలియాడి

ఆకతాయి అలలతో

ఆటలాడి అలసి సొలసి

తనువు మరచి పడివుంది

తీరం చేరిన యా శిలా శిశువు

ఆ జిర్కోనియం యిసుక పలుకు

తనకేమీ తెలియకనే

వేరెక్కడికో తరలి పోయి

భావి భరత ప్రగతి కొఱకు .....

విద్యుత్ వుష్ణ వాటికల

అత్యున్నత వేడిమిలో

క్షారాలతో కలసి వుడికి

ద్రావకాల కనలి కుమిలి

ద్రవ రూపం.... ఘన రూపం ....

రేకు వలె గొట్టంలా

అణు ఇంధన కడ్డీలకు తొడుగు వలె

ఎన్నో ఎన్నో రూపాంతరాలు

అణు ఇంధన వుత్పాదక

ప్రక్రియలో

తనవంతుగ

భావి భరత గృహ సీమల

బంగారు కాంతులు నింపగ

భరత జాతి జన జీవితాలు

కళ కళ లాడే టందుకు

పాపం !!

ఆ జీవ రహిత శిలా శిశువు

స్వయం గా అర్పితమై

అంకితమై .............. రచన : నూతక్కి రాఘవేంద్ర రావు , తేది :౨౯-౦౧-౨౦౦౯





28, జనవరి 2009, బుధవారం

ఆశ్చర్యంగా ..వారంతా...

బానిసత్వ బ్రతుకులు
శారీరక వేధింపులు
శూలాలతో ఘాతాలు
వంటి నిండ వాతలు
గొలుసులతో బంధనాలు
మలమూత్రపు గోతుల్లో
రోగాలతో రోస్తులతో పస్తులతో
బందీలై ఆ జీవులు...
చచ్చినోళ్ళు చావగా
మిగిలినోళ్ళ.. బ్రతుకా అది !!! ..

సాంఘిక వ్యత్యాసాలు
ఆర్ధిక వేధింపులు
తింటానికి తిండి లేక
కట్టుకోను బట్ట లేక
తల దాచు కోను గూడు లేక
ఒక చెట్టా? ఒక పుట్టా?
ఎటు పోనూ అదను లేక
చలికి వణికి ఎండల్లోమాడి మాడి
వానల్లో వరదల్లో
తడిసి జడిసి ..

ఒక రోజా,వత్సరమా
దశాబ్దాలు ,శతాబ్దాలు
కాదు కాదు
సహస్రాది వత్సరాలు
క్రూరంగా అతి ఘోరంగా
కవోష్ణ రుధిర కాసారాల్లో

కనలి కుమిలి
రాళ్ళల్లా,రప్పల్లా
మురుగులోని
పురుగులాగా...
తమ తోటి సాటి
మనుష జాతి సాగించిన
క్రూర ఘోర అమానుషం
ఆ అక్రుత్యాలెన్నో
ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్నెన్నని !!!?

హీనంగా చూస్తే.
హింసిస్తూ వుంటే
భోరు మంటూ ఏడ్చి
దీనంగా బతుకులీడ్చి
ఎతలతో నిట్టూర్పుతో.
యెవరూ తమ కోసం
ఒదార్చగ రారనుకొని.....

తమను తామే ఒదార్చుకొంటు
నేర్పుగా ..
మనసే ఆయుధంగా
అదనుకొరకు వేచి చూసి
ఒదిగి ఒదిగి ఒదిగి వుండి
ఒక్కసారే !!!!!!!
నేల నుంచి నింగికేగసి
నల్లని ఆ సూరీడు ... చూడు
అంబరాన్ని చుంబించి
అధికారం అందుకొంటే ....
అవాక్కయి నోళ్ళు తెరచి
అంతా అంతా అంతా
అవనిలోన వారంతా
ఎంతో ఎంతో ఎంతెంతో ఆశ్చర్యంగా !!!!
(ఒబామాకు అభినందనలతో) రచన
:నుతక్కి రాఘవేంద్ర రా వు,తేది :౨౧-౦౧-2009

26, జనవరి 2009, సోమవారం

కుక్షి

కుక్షి యనే
రెండక్షరాల
ఆ సజీవ జీవ జాల
యంత్రాంగం ఆకలి యను
మూడక్షరాల తన భావనా
సం హరణా ప్రక్రియలో
జీవుల పై అధిరోహణ!!!
స్వారి చేస్తూ
వేటాడుతూ సంహరిస్తూ ....
జలంలోన భూమి పైన
వాయు పరిధి నెచటనైన
బలహీన జీవ బక్షణ

సహ జీవుల సజీవ
సంహరణా కారణ మై .
ఆక్రన్దనా భూతమై......
అను క్షణం ఆవేదన
ఆందోళన ఆక్రందన
భీతావహ మృత్యు ఘోష
జీవావళి మది లోతుల
భయం భయం ప్రాణ భయం

ఆ కుక్షే తన ఆకలి భావన
మాపుకునే ప్రక్రియలో...
ఆకలితోమానవాళి
కుక్షి నింపు యత్నం లో
ఆ మానవజీవులు
కక్ష ద్వేష క్రోధ
మద మాస్తర్య జనిత
స్వార్ధం సంకుచితం
అసహన భరిత
అహంకార భావనం
నిత్య హత్య
నిత్య హనన
నిత్య యుద్ధ
నిత్య మరణ
నిత్య జీవ హరణం
ఈ భూమాతకు
అనవరతం ఆక్రోశం
ఆ ఘాత జనిత ఆక్రందనం : రచన: నూతక్కి
రాఘవేంద్ర రావు , తేది :26-01-౨ 009

ఆకలి పై యుద్ధం

ఈ భువి పై పుట్టిన

ప్రతి జీవీ, తన జీవికకై

కొన సాగించే

ప్రక్రియలో పరాన్న జీవిగ

పరాన్న భుక్కై పరిక్రమిస్తూ

చెట్టునైన పుట్టనైన

గూటిలోని గుడ్డు నైన

గాలిలోన పక్షినైన

నీటిలోని ఏ ప్రాణి అయిన

క్రిమి కీటక జీవజాలం

ఏదైనా ...దేనినైనా

తోటి జీవినే పరిమార్చే

క్రూర ఘోర విధి

విధాన నిధనం అంతం

చేసేందుకు, ఆపేందుకు

ఈ అఖండ భూ మండలాన ........

పాపం పుణ్యం దయ్యం దైవం

నరకం స్వర్గం

ర్ధా అనర్దాలేవయినా

సూర్యుడు చంద్రుడు చీకటీ వెలుగు

ఎత్తు పల్లం వ్యత్యాసాలేవైనా.........

పుట్టిన ప్రతి జీవి

జీవించే హక్కు కొరకు

కష్టం దుఖం బాధ ఆనందం

అనుభావాన పొందేందుకు

జీవార్నవ సర్వ జీవ

రక్షా హక్కుల పరి రక్షణకై

పోరు సలిపి శాస్త్రజ్ఞులు

ఆపాలి ఆపాలి ఆపాలి

ఆకలి కై జరిగే ఈ జీవ కలి. రచన : నూతక్కి రాఘవేంద్ర రా వు , తేది :౨౬-౦౧-2009





21, జనవరి 2009, బుధవారం

తనకు మాలిన ధర్మం

ఆకలితో అలమటిస్తూ
ఆవురావురంటుంటే
తినడానికి పెట్టమని
వేడుకొంటూ వుంటే
కలిగిన దానిలోనే
కడ పంక్తినయిన
పెట్టు కాని
అడగకుండా పోవువాన్ని
ఆదరించుదామనుకొని
పిలచి పిలచి పెట్టబోకు
భంగపాటు పొందబోకు . రచన:నుతక్కి రాఘవేంద్ర
రావు, తేది :౨౧ -౦౧-2009

18, జనవరి 2009, ఆదివారం

భావ మధనం 2

ఆకలి
-------
ఆకలికి అసలు
లేవు
వున్నవాడు
లేనివాడు
ఆన్న
తారతమ్యాలు.

తినకలిగేదేవరైనా
పిడికెడంత ముద్దే
అంతకన్నా
ఎక్కువైతే
కడుపంతా కలతే
-------------------

తపన
-------
నీకోసం తపన సరే
నీ సంతానం కొరకు సరే
మరి యింకా ఎవరి కొరకు
అంతులేని ఆవేదన
అనంతమైన ఆ ధన సంపాదన
-----------------------------

వ్యత్యాసాలు
-----------
జీవనకై
జీవితమా
జీవించుటకా
జీవనం
మర్మం
తెలుసుకో

మనుగడ
సాగించుకో

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 26/12/2008

16, జనవరి 2009, శుక్రవారం

మూర్ఖత్వం....

ఎండిన ఆ చెట్టు మీద
చిట్ట చివరి కొమ్మ మీద
పిట్టవకటి కూర్చున్నది
రిక్కి రిక్కి చూస్తున్నది
ఎటుచూసినా ఏమున్నది
నరకబడిన ఆ అడవి తప్ప

తనవారు ఎవరు లేరు
తోటి వారు కానరారు
ఎటుపోతిరో ఏమైతిరో
తెలియని అయోమయం
ఆహారం కోసమని
అడివంతా తిరిగి తిరిగి
అలసటతో వచ్చేనేమో
ఆకలితో దాహముతో
అలమటించి పోతూ
ఆ పక్షి మాత్రం అనుకొన్నది
ఈ మనుషులకు బుద్దిలేదు
జ్ఞానమింత కూడ లేదు
కొత్త చెట్టు పెంచ కుండ
వున్నా
చెట్లు నరుకుతారు
మూర్ఖులు కారె వారు ?
చెప్పేందుకు ఎవరు లేరా?
ఏం మనుషులో పాపం
ఎలా బతుకుతారో ...
అనుకుంటూ శోష తప్పి
అంతలోనే తనువు వీడె
ఈముప్పు
ఒక్క తనకె కాదు
నీకు కూడ నాకు కూడ .
ప్రకృతిని చిద్రం చేయకు
శాప గ్రస్త మవ్వబోకు
ప్రణమిల్లు పూజించు
ఆమె వడిలో పుట్టి నీవు
ఆమె గొంతు కోయబోకు
నిన్ను నీవు నరుక్కోకు

పచ్చని చెట్లన్నీ పోయే
చెరువులన్నీ ఎండి పోయే
నీరు దొరక కష్టమాయే
ఎండలేమో మండిపోయే
చెట్లనన్ని నరుకుతుంటే
పచ్చ దనం పారిపోయే
చెట్లను నరికిన మనుషులు
కొత్త మొక్క
నాట రాయె
చెట్లనేమో పెన్చరాయె
కాన్కిరీటు భవనాలకు
కొండలేమో కరిగిపోయే
కాక కూడ పెరిగిపోయే.
జంతు జాల మేటు పోవాలె
బతుకు లెటుల గడపాలే రచన : నూతక్కిరాఘవేంద్ర రావు తేది : 25/12/2008

15, జనవరి 2009, గురువారం

రినో నగర పర్యటన

అది డిసెంబర్నెల, రెండు వేల ఎనిమిది. హైదరాబాద్ నుండి , నేను, నా భార్య అమెరికా లోని కాలిఫోర్నియాకు మా పెద్దఆమ్మాయి దగ్గరకు వచ్చి ఒక నెల అయింది.ఆమెకు ఇద్దరు పిల్లలు.
మన తెలుగు సంప్రదాయం ప్రకారం, మనుమరాలికి చీరలు, మనవడికి పంచలు ఇద్దామని వచ్చాము. ఆ ఫంక్షన్ ఘనంగా జరిగింది..
ఇంకా ఇతర బంధువులు స్నేహితులు కూడా ఇక్కడ వుండటంతో, మేము వచినప్పుడల్లా ఆరు నెలలు వుండి వెలుతుంటాము.
మనవడు ,మనుమరాలు వాళ్ల స్కూల్ శలవలు అయిపోతున్నాయని ఎక్కడికన్నా టూర్ వెళ్దామని ప్రోపోజల్ పెట్టారు .
మేము అంటే - నేను, నా భార్య,మా అమ్మాయి ,పిల్లలు, స్నేహితులు , వాళ్ల పిల్లలు,వేరు వేరు కార్లలో బయలు దేరాము.ఆ రెనో పట్టణానికి, మా పిల్లలు వుండే నగరానికిమధ్య షుమారు ౩౦౦ మైళ్ళ దూరం వుంటుంది .ఆమార్గం లో ఎక్కువ భాగం సముద్ర మట్టానికి చాలా ఎత్తు లో వుండటం తో nu ,ఆ పట్టణ పరిసరాలన్నీ అదే స్థితి లో వుండటం తో అక్కడ మంచు ఎక్కువ కురుస్తుంది.మంచు పర్వతాలు చాలా ఎక్కువ. దారిలో రోడ్ల పై మంచు వుంటే అక్కడ కారు స్లిప్ అయి ప్రమాదం జరగ కుండా వుండేందుకు ముందు జాగ్రత్త గా వీల్స్ కు చెయిన్ లు వేస్తారు.

అట్లాంటి పరికరాలు సమకూర్చుకొని,ఇంధనాన్ని నింపుకొని, ఆహార పథార్థాలు, పిల్లల ఆటవస్తువులు, చలికి తట్టుకొనేబట్టలు, మంచులోఆడుకునేన్దుకు పరికరాలు, తీసుకొని మధ్య మధ్యలో గాస్ స్టేషన్ దగ్గర ఆగి,రెస్ట్ రూమ్ లకు వెళ్లి కాలకృత్యాలు తీర్చ్కొని కాఫీ లవి త్రాగి అవసరమున్నప్పుడు ఇంధనం నింపుకొని, మొత్తానికి, అర్థరాత్రి రెనో నగరంచేరాము. దారిలో ఎక్కడా చక్రాలకి చయిన్ లు వెయ్యాల్సిన అవసరం రాలేదు. సిటీ లో అడుగు పెడుతూనే, ముందుగా ఒకఇండియన్ హోటలుకు వెళ్లి భోం చేసాము.
నగరం చాలా అందంగా ,రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంక్యరిచబడి విశాలమయిన రోడ్లకు ఇరువైపులా కాంతి వంతమయిన దీపాల వరుసలు, ఆ నిశీధి లో ఆకాశం వైపు చూస్తేఆకాశం కాదు ఆకాశాన్నంటే భావన సముదాయాలు మాత్రమె కనబడుతున్నాయా అన్నట్లు మిల మిల లాడుతూ చాల ముచ్చటగా కనుల విందులు చేస్తూ స్వాగతించాయి . ఆతరువాత హోటల్ సిల్వర్ లెగసి చేరి పార్కింగ్ లాట్ లో ఎనిమిదో అంతస్తులో కార్లు పార్క్ చేసి, ఏడో అంతస్తు లోముందే రిజర్వు చేసుకున్న మా మా గదులకు లకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకొని కాసినో లకు బయలు దేరాము.
కాసినోలలో కాసేపు తిరిగి సర్కస్ సర్కస్ కాసినోలో అప్పుడే మొదలయిన సర్కస్ చూసాము. తరువాత ఏవరికి వాళ్ళుగా విడిపోయి, కాసినో కు వెళ్ళాము . నేను మాత్రం స్లాట్ మెషిన్ లో ఆడి పైసలు పోగొట్టుకొంటే, పిల్లలు మాత్రం బొమ్మలుగెల్చుకొన్నారు. మిగతావాళ్ళూ కొందరు గెలిస్తే కొందరు పైసలు హుండీ లో వేసామనుకున్నారు.
రోజువారి పనుల వత్తిడినుంచి మనసును మళ్ళించి విశ్రాంతి నివ్వడానికి ఇలాంటి పర్యటనలు వినోదం గా విలాసంగావుండి, పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువ సమయం కలిసివుందే అవకాశం కలిగిస్తాయి.
ఇక్కడ సూపర్ లెగసి హోటల్నుండి ఎన్నో కాసినోలు , భవనాలు అనుసంధానించబడి వున్నాయి. అన్ని వసతులు అక్కడే పొందవచ్చు.ఇక సూపర్ లెగసి భవనం లో సౌకరియాలు అమోఘం. అంతే కాకుండా ఆ భవనం బయట నుండి కూడా చూడముచ్చటగా ఎలిగెంటుగా వుంటుంది.

ఇక్కడ మధ్యలో ముచ్చటించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పటం మాటల మధ్యలో మరచిపోయాను.
...అమెరికాలో చెప్పుకోవలసిన అనేక గొప్ప విషయాల్లో ముఖ్యమయినవి ; విశాలమయిన రోడ్లు , బ్రిడ్జిలు,రోడ్ల పై డైరక్షన్ బోర్డులు,సుచి, పరిసరాల పరిశుభ్రత .
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటిదగ్గరే నెట్ నుంచి మ్యాప్ తీసుకొని వెళ్ళవచ్చు .ఎవరినీ దారి మధ్యలోనో చౌ రస్తాల దగ్గరో ఆగి, బాబూ ఆ ఊరికి దారెటు.. ఎటు ప్రక్కకు వెళ్ళాలి అని ఎవరిని అడగనక్కర లేదు. అడగటానికి మనిషనే వాడు దొర్కితె కదా!
రోడ్లు, బ్రిడ్జిలే అమెరికా వారి ఆర్ధిక రంగ విజయానికి ఒక ముఖ్యకారణమని చెప్పవచ్చు.గల్లి అయినా, ఘాట్ రోడ్ అయినాజాతీయ రహదారి అయినా ,రోడ్లు బ్రిడ్జి ల విషయంలో అమెరికా వారి శ్రద్ధ...నిజంగా వారి తరువాతే మరేదేశమైన అనిచెప్పడంలో ఏమీ పొగడ్త లేదు .ఎన్నివేల మైళ్ళు ఐనాసరే ఎక్కడా రోడ్ కు అడ్డంగా ఏ జంతువు గాని మనుషులు కాని రారు . అంత పెద్ద దేశంలో ఆ ఏర్పాటు అమోఘమని చెప్పక తప్పదు.అంతే కాదు శుభ్రత విషయంలో ,పరిసరాలను నీటుగావుంచడం లో అమెరికాలో వున్న ప్రతివారు ఆఖరికి క్రొత్తగా అమెరికా యాత్ర కు వచ్చిన వారు కూడా ఇందుకుతోడ్పడం,పాటించడం చాలా గొప్ప విషయం. ఒక్క ఈ విషయమనే కాదు అన్ని ప్రభుత్వ విధానాలను ప్రజలుగౌరవిస్తారు ,ఆచరిస్తారు. అందుకు వ్యతిరేకంగా నడుద్దామని ప్రయత్నం ఎవరూ చేయరు. అంటే ఒక రూల్నుప్రవేసపెట్టేముందే ఆ విషయమై చర్చ జరిగి ప్రజల అభీష్టాన్ని తెలుసుకున్న తరువాతనే రూల్ గా మారుస్తారు. కాబట్టి ముందే ప్రజల అభిమతాన్ని తెలుసుకొని, వారి అభ్యంతరాలు కూడా గమనిస్తూ యాక్టులు పాస్ చేస్తే ,ఆచరించేందుకు ప్రజలు సిద్ధం గా వుంటారు.గౌరవిస్తారు. అంగీకరిస్తారు.
మనిషిని చూసి మనిషి నేర్చుకుంటాడు , ఆచరిస్తాడు అన్న మాట ఇక్కడ వాస్తవం. రోడ్ రూల్స్ పాటించటం దగ్గర, టాక్సు కట్టే దగ్గర, పెంపుడు కుక్కలుబహిరంగ ప్రదేశాలలో మల మూత్రాలతో కాలుష్యం చేయకుండా, పిల్లలను,తల్లి తండ్రులు దండించే విషయంలోను, పెంపుడు జంతువులను విచ్చలవిడిగా వదిలేయకున్డాను, ప్రభుత్వం కతినాతి కటినంగా వుండటం తో ప్రజలు కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరిస్తారు .ఎవరూ, ఎక్కడా బహిరంగాంగావుమ్మడం చూడ లేదు, బహిరంగంగా,మల, మూత్ర విసర్జన చేయరు,చెత్త కాగితం ముక్క కూడా విసిరేయరు,మన ఇంటి చెత్త ,మన ఇంటి ముందో వెనకో, ప్రక్కవాడి ప్లాట్ లోనో, ఖాళీగా వున్న ప్రదేశాలలోనో ,వేయరు. అంత పెద్ద దేశం లో వేస్ట్ డిస్పోజల్ సిస్టం అనే ప్రక్రియ నిరంతరంగా సాగుతూనే వుంటుంది. దానికి కావలిసిన యంత్రాంగం నిరంతరం పనిచేస్తూనే వుంటుంది.ఆ వేస్ట్ ,రి సయికిల్ చేసి వస్తూత్పత్తి చేసే ప్రత్యెక యంత్రాంగం వారికి వుంది.అందు చేత ,చెత్త కుప్పలుగా పేరుకుపోతుంది అన్న భయం లేదు. దగ్గు వచ్చి తెమడవుమ్మాలిసి వచ్చినా, ముక్కు చీదాలిసి వచ్చినా, ప్రత్యామ్నాయవిదానాలో ,వాటికి నిర్ణయించిన ప్రదేశాలలోనో తప్ప, బహిరంగ ప్రదేశాలని మైలపరచరు.పుట్టిన దగ్గరనుంచే ఆయా విధానాలు అలవడటం వల్ల కావచ్చు,ప్రభుత్వ సదుపాయాలు, విధానాలూకతినంగా వుండటంవల్లకావచ్చు,తరాలుగా వస్తున్న అలవాటు కావచ్చు, ఏదేమైనా వారు పరిసరాలను కాపాడుకొనేవిధానాలూ, ఇతర మరెన్నో విషయాలలో ప్రతివారూ తీసుకొనేసామాజిక భాద్యత క్రమ శి క్షణ, మనందరం అందరం , ప్రపంచమంతా కూడా ఆచరించ దగ్గవి, మరియు, ప్రస్తుతించ దగ్గవి.ఈ విషయం లో మాత్రం యిక్కడి ప్రజలను ప్రశంసించి తీరాలి..

అమెరికాలో రోడ్ ప్రయాణం చాలసౌకర్య వంతంగా వుంటుంది .ఒక నగరంలోని ఇంటి నుండి మరో నగరంలోని మరోచోటికి దిశా నిర్దేశం చేసే పరికరాలు విరవిగా ప్రతి కారుకు అందుబాటులో వుండడం, అందరి ఇళ్ళల్లో కంప్యూటర్లు వుండటం వల్ల.....
హోటళ్లు బుక్ చేయడమైనా, లేక చూడాలనుకొన్న ప్రదేశంలో అనుమతి టిక్కెట్లు కొనాలన్నా చాల సుఖంగా జరిగిపోతోంది.వెళ్ళిన ప్రదేశంలో ఇంకా చూడాల్సిన విశేషాలు ఏమైనా ఉన్నాయో కూడా తెలుసుకుని ప్రయాణ ప్రణాళిక సిధంచేసుకోవచ్చు.రోడ్లు విశాలంగా వుండటం, అనేక లైన్లు వుండటం, వెళ్ళే వాహనాలకు వచ్చే వాహనాలకు వేరు వేరుప్రత్యేకమయిన మార్గాలు వుండటం వల్ల నిర్ణీత వేగానికి మించని వేగం లో ప్రమాదాలు జరగ కుండా ప్రయాణంచేయవచ్చు.అమెరికాలో ఏ రోడ్ మీద అయిన కుదుపులు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా వాహనం నడిపేవారికి ఈ రోడ్లు పైన ఎన్ని మైళ్ళు అయినా , చాలాసౌకర్యంగా , అలసట లేకుండా ప్రయాణం చేయ వచ్చు. వాహనాలుకూడా రోడ్ల మీద ప్రయాణానికి, అనుకూలంగా, ఆహ్లాదకరంగా వుంటాయి.

రెనో ముచ్చట్లు మానేసి వేరే పిచ్చాపాటి మాట్లాడి బోరు కొడుతున్నానా?.
అసలు విషయానికి వద్దాం.

ఆ రాత్రి రెండు గంటల కు హోటలుకు వచ్చిఅందరం పడుకున్నాం. అలసి వుండటం తో బాగా నిద్ర పట్టిందేమో ,లేచే సరికి వుదయం ఎనిమిది. వెంటనే కార్యక్రమాలు పూర్తీ చేసుకొని కిటికీ కర్టెన్ తీద్దునుకదా...వావ్!!...వావ్! .....అబ్బురపరిచే ఆ - ఆ ఆ దృశ్యం...
కళ్ళెదురుగా .....ఇటుక వర్ణం, నీలం రంగులతో కూడి తెల్లని మంచు దుప్పటి కప్పుకున్న ఎత్తైన పర్వత సానువులు,వాటి పైనతేలియాడే తెల్లని మేఘాల దొంతరలు ,అప్పడే వుదయిస్తున్న సూర్యుని లేలేత కిరణాలు ఆ మంచు దొంతరల గుండాపయనించి సృష్టించిన ఇంద్ర చాపం ,భాను ని కిరణాలు మేఘ మాలికల ద్వారా పయనించగా , పర్వత పాదం నుంచిశిఖరం వరకు మారుతున్న రంగులు ,ఈ క్రమంలో పర్వత వున్నతాలలో, లోయలలో , , సూర్యునిఅవరోహనా క్రమం వల్ల మారతున్న నీడలు, రంగులు, పర్వత కన్నియ, నిద్ర నుంచి లేస్తూ ఓడలు విరుచు కొంటూ ,
పయ్యెద జారుతున్నా కానని స్థితిలో కూని రాగాలు తీస్తూ నర్తిస్తున్నదేమొ ననే భావన......మీరు కవి కానక్కరలేదు, మనిషైవుంటే చాలు ... ఆ దృశ్యం......అది ...... అది దృశ్య గీతమో,నృత్య గానమో అనిపించక మానదు.

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 24/12/2008

14, జనవరి 2009, బుధవారం

ఎమనుకోను...........

ఈ క్షణమో
మరుక్షనమో
జడి వానగ
మారిపోయి
నలుదిక్కుల
వర్షిస్తే.........
ఆహ్లాదం ఆనందం
ఎదురు చూసినట్టి క్షణం
రాకుండానె పోయె....
ప్రసవవేదన పడుతూ
ఆఘమేఘాలపై
వచ్చిన ఆ మేఘ వనిత....
ఈ ప్రాంతం
కాంక్రీటు ఎడారి
ప్రసవానికి తావు కాదిది
నాసంతానం
భువి కి చెరకనె
ఆవిరవ్వునిట.....
తన వేమరుపాటుకు
తననె తిట్టుకొని
పచ్చనియా
అడవుల కై
వెదుక్కొంటూ
తడబడుతు
భయపడుతు
వడి వడిగా నడయాడుతు
ప్రస్తానంచేరుతూనే
ఆపలేక
వర్షిస్తే
ఏమనుకోను? నేనేమనుకోను?

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 25/12/2008

నైవేద్యం

ప్రకృతి
దిశగా పయనించి చూడు
ప్రకృతి
వడిలో పవళించి చూడు
పారవస్య సంద్రపు
అలలపైన ఓలలాడు
ఆనందపు అనుభూతులు
అనుభవించి పరవశించు

ప్రాపంచిక బాధలను
కష్టాలను దుఖాలను
బాధను ఆవేదనను
ఆందోలనలన్నింటిని
క్షణమైనా ఒక్క క్షణమైనా
తరిమి తరిమి పార ద్రోలు
ఆ క్షణంఅనుభవించు
అమృతరస
ఆస్వాదానందానుభూతి
అదే నీ మనసుకు నీవిచ్చే
నైవేద్యపు దివ్య స్ఫూర్తి

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 25/12/2008

13, జనవరి 2009, మంగళవారం

పొదుపు

దారాన్ని విడివిడిగా చూస్తూ పోతే
కేవలం అది దారపు పోగు
పడుగు పేకల మధ్య పెనవేస్తే
అది గుడ్డ ముక్క

పైసలన్ని విర జిమ్మితే
చిల్లర నాణ్యాలు
కలుపుతూ పోతే
ధన సమూహాలు

పోదుపు చేస్తూ పోతే
గగన పధంలో నీవు
ఖర్చు చేస్తూ పోతే
నిమ్న తలం లో నీవు

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 25/12/2008

దృశ్య గీతం....మంచు దుప్పటి

అది ఒక
మహాద్భుత దృశ్య కావ్యం
నేత్ర పర్వ సుధా గానం
గాత్రోద్భవ వర్ణ శోభితం
వర్ననాతీత మనోజ్ఞ చిత్ర రాజం
మేఘావ్రుత ఆకాశం
ఆకాశ చుంబిత పర్వత శ్రేణి
తెల్లని దూది పింజల్లా తేలియాడే
మేఘమాలికలు
మేఘమాలికల నీలి నీడలు

ప్రక్రుతి పురుషుని ప్రగాఢ పరిష్వంగ
సుఖంలో తేలియాడుతూ
అర్థ నిమీలిత నేత్రాలతో
పరవశిస్తూ ఆ నగ కన్నిక

మై మరచిన తన్మయతలో
తనువునే మరచిన యా
వన్నెలాడి
పరవశంతో
పల్లవిస్తూ
మేను మరచి
నగ్నంగా!!!
ఆ నగ్నత పై.....
ఆప్యాయంగా
వుదయ భానుడు వెదజల్లిన
వర్ణ రాజితం.
ఆ అత్యద్భుత సౌందర్యం
వీక్షించలేక
సిగ్గిలి
హిమవంతుడు కప్పిన
తెల్లని ఆ మంచు చీరె యా
వంపుల సొంపులు దాచ లేక
పడుతున్న తొట్రుపాటు
అదే అదనుగా శ్వేత మేఘాల
చిలిపి స్పర్శ తో
ముకిళిత అయి
ఆ పర్వత కన్నియ...
ఆహో!! అది

మహాద్భుత
మనో జనిత
భావ దృశ్యం
(ఎన్నెన్ని వగలు పోతున్నావే వయ్యారి)
అని వో కవి వ్రాసినట్లు
వీక్షించి తరించి గానం చేసే భావోద్భవ
దృశ్య గీతం

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 25/12/2008

12, జనవరి 2009, సోమవారం

విశ్వరీతి

అనంతానంత విస్వాంత రాళం లో
అనంతః కోటి నక్షత్ర సముదాయాలు

ఖగోళంలో భయంకర అగ్నికీల గోళాల
నిరంతర అవిశ్రాంత పయనం
అలుపెరుగని శ్రమ తెలియని
అనునిత్యం క్రమ రీతిన పురోగమనం

పరిధులు దాటని ఆ
నక్షత్ర సముదాయాలు
అందలి ప్రతి నక్షత్రం
అనవరతం పయనిస్తూ

తమ పరిధులు
మాత్రం దాటవు
తమ తమ మార్గం
మాత్రం వీడవు

రచన : నూతక్కిరాఘవేంద్ర రావు
తేది : 25/12/2008

10, జనవరి 2009, శనివారం

భావ మధనం 1

ఐకమత్యం
-----------
ధనంతోటి కొన్న బలం
వుంటున్దొక క్షణకాలం
మనం ఒకటి అన్న బలం
నిలిచి వుండు కలకాలం

ప్రభోధం
-------
ఎప్పుడో చేయలేదు

అనుకుంటే పొరబాటు
యిప్పుడైన చేయకుంటే
ఎంతెంతో గ్రహపాటు

అందు బాటులో వున్న
పూవు కోసుకో గాని ,
చిట్ట చివరి కొమ్మనున్న
పండు కొరకు ప్రాకబోకు

నీటి లోతు తెలుసుకొని
యీతకొరకు దిగు కాని
తెలియని కొలను లోన
తలమునకలు కాబోకు

తృప్తి
-----
నీ ఆశ
ఆనందం
నడుమ
అనంత అఖాతం,
తృప్తి అనే వంతెనతో
చేరుకో ఆ దరికి



Nutakki Raghavendra Rao
తేది : 26/12/2008